Sunday, October 16, 2011

ఓ యువతా నీ పయనమెటు ......?


ఓ యువతా నీ పయనమెటు ......?

All power is within you
You can do anything and every thing
Believe in that 
యువతనుద్దేశించి  స్వామి వివేకానంద ఉవాచ.
యువత కళలు కనాలి - వాటిని సాకారం చేసుకోవాలి. అబ్దుల్ కలాం ఉర్బోధ.
నేటి బాలబాలికలే రేపటి భావిభారత పౌరులు.
        ఆహా ! ఎంత బాగున్నాయి ఈ నీతి వాక్యాలు . వారన్నది నిజమే. కానీ నేడు అవి ఎలా పక్క దారి పడుతున్నాయో చూడండి 
·        యువశక్తిని రౌడీయిజానికి వినియోగిస్తూ,
·        భవిష్యత్తు గురించి కలలు కనకుండా ప్రేమ కలలుకంటూ,
·        నేటి బాలబాలికలే రేపటి ప్రేమికులు అన్నట్లుగా అర్థాన్నే మార్చేస్తున్న కొంతమంది యువకులను చూస్తే హృదయం ధ్రవించక మానదు.

 పుట్టినందుకేదైనా గట్టిపనీ చేయాలి
 నీవున్నా లేకున్నా నీ పేరు నిలవాలి 

            ప్రేమించడం గొప్పకాదు. ప్రేమించబడటం, అభిమానించబడటం గొప్ప, ప్రేమనేది అమ్మాయి,అబ్బాయి మధ్యగల ప్రేమే కానవసరంలేదు. అది తాత్కాలిక ప్రేమ ఇలాంటిప్రేమ పెళ్లితో ముగుస్తుంది. సమాజంకోసం దేశం కోసం ఏదిచేసినా శాశ్వతంగా అందరి హృదయాల్లో పూజింపబడతారు. 
ఎక్కడో పుట్టిన మదర్ థెరిస్సా సేవ ద్వారా ప్రపంచానికి మదర్ అయింది (మదర్ థెరిస్సా )
కరంచంద్ గాంధీ జాతికే తండ్రి అయ్యాడు. (జాతి పిత )
అబ్దుల్ కలాం యువతరానికే రోల్ మోడల్ అయ్యాడు .
సంకల్పం ఉంటే సాధించలేనిది  ఏదీ లేదు . కానీ ఆసంకల్పం వక్రమైన మార్గానికి ఉపయోగిస్తేనే ప్రమాదం. కొంతమంది యువకులు చేసే పని అదే .
·        బుడి బుడి అడుగులు వేసిన కాళ్లు - నేడు అమ్మాయిల వెంట పరిగెడుతున్నాయి.
·        అమ్మ కోసం వేచి చూసిన కళ్ళు - నేడు అమ్మాయిల కోసం ఎదురుచూస్తున్నాయ్.
·        ''అమ్మా'' అని ముద్దుగా పిలిచిన పెదాలు నేడు బూతులు వల్లిస్తున్నాయ్.
·        కలం పట్టిన చేతులు కత్తులు పడుతున్నాయ్.
·        పాఠాలు చదవవలసిన వయసులో ప్రేమ పాఠాలు వల్లిస్తున్నారు.
·        శిశువులుగా పుట్టి పశువులుగా మారుతున్నారు.
·        మంచిని మాత్రమే చూడవలసిన కళ్ళతో నీలి చిత్రాలు చుస్తున్నారు.
·        మర్మస్థానం కాదది జన్మస్థానమని ఎప్పుడు తెలుసుకుంటారో.


చదువును ప్రేమించండి :
            చదువును ప్రేమించండి, అమ్మాయిని కాదు. దానికింకా టైముంది, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటే ఎవరూ కాదనరు. చెడుదారిలో వెళ్లి చదువును, జీవితాలను బలిచేసుకోవద్దని పెద్దల అభిప్రాయం.
అందాలు తాత్కాలికం :
            మొన్నటి ప్రపంచ సుందరీమణుల పోటీల్లో న్యాయనిర్ణేతలు అడిగిన ప్రశ్న. ఒక వేళ మార్చుకునే అవకాశం వస్తే శారీరకంగా  నీవు దేనిని మర్చుకుంటారని అడిగితే, నేనిప్పుడు ఎలా ఉన్నానో అలాగే ఉంటాను, దేవుడిచ్చిన దేహం పట్ల సంతృప్తిగానే ఉన్నాననే సమాధానం చెప్పిన యువతిని ప్రపంచసుందరిగా ఎంపిక చేశారు. 
            బయటకు కనిపించే సౌందర్యం కన్నా ఆత్మసౌందర్యమే గొప్పది. ఎన్ని డిగ్రీలు ఉన్నా ఉన్నతమైన వ్యక్తిత్వం ముందు అన్నీ బలాదూరే. తాత్కాలిక అందాలకు మురిసి, దీర్ఘకాలిక లక్ష్యాలను కాలదన్ని, బంగారు భవిష్యత్తును చేజేతులా పాడు చేసుకుంటే కన్నవారి ఆవేదనను అర్థం చేసుకునే వారెవరు...? 
            కడుపులో ఉన్నపుడు తన్నితే ఆ బాధను తియ్యని బాధగా భావించి భరించింది తల్లి. పెరిగి పెద్దయ్యాక గుండెల మీద తన్నితే భరించడం ఎవరివల్ల అవుతుంది.
            తన బిడ్డ శ్రీరామచంద్రుదంతటి సంస్కారవంతుడు కావాలని కలలు కంటుంది. కానీ కాలం గడిచే కొలది ఒక్కొక్క కల చెదిరి పోతుంది. వాస్తవ పరిస్థితులు భయపెడుతుంటాయి. నా బిడ్దేనా ఇలాంటి పనులు చేస్తున్నది. ఇందుకోసమేనా నేను నవమాసాలు మోసి కన్నది. ఇలా జరుగుతుందని తెలిస్తే అసలు కనేదాన్ని కాదు కదా అని మూగగా రోదిస్తుంది. 
ప్రేమించి తీరాలా ?
            ప్రేమిస్తావా చస్తావా అంటే ఎలా.? ప్రేమనేది వనేవే ట్రాఫిక్ కాదు. చిన్నప్పుడు మారం చేయగానే చాక్లెట్ వచ్చి చేతిలో పడ్డట్టుగా, కోరగానే వచ్చి ఒళ్లో పడటానికి అమ్మాయిలు చాక్లెట్లు కాదు. వారికో మనసుంటుంది. దానికో లక్ష్యముంటుందని గ్రహించాలి. ప్రేమే జీవితం కాదు. జీవితంలో ప్రేమ ఒక భాగం మాత్రమే. మీరనుకుంటున్న ప్రేమ కాకుండా ఇంకా చాలా ప్రేమలున్నాయి. వాటికోసం అన్వేశించండి. అవి శాశ్వత ఆనందాన్ని ఇవ్వడంతో పాటు, కీర్తీ, ప్రతిష్టలను కూడా ఇస్తాయి. దేనికోసం దేన్ని వదులుకోవాలో తెలుసుకోవడమే విజ్ఞత. అది మనకున్న రోజున మనతోపాటు మనచుట్టూ ఉన్న వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. ఇంతకన్నా మిన్న ఈ ప్రపంచంలో ఏదీ లేదు. ఇక ఛాయిస్ మీదే. రేపటి భావిభారత పౌరులుగా ఆలోచించండి. 
            ఈ దేశ భవిష్యత్తు మీ చేతుల్లోనే వుంది. యువతలో మంచి మార్పు కోసం ఈ సమాజమంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తుంది .

No comments:

Post a Comment

Latest Posts

pages